అసెంబ్లీలో బూతులు తిడుతూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు: చంద్రబాబు 1 y ago
AP : ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదని, కానీ వైసీపీ ప్రభుత్వం.. పార్టీ ఆఫీసులపై దాడులకు పాల్పడిందన్నారు. తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవని, అలా అని తప్పులు చేసే వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపామని, ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరంలో కూడా గంజాయి పండటానికి వీల్లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా గంజాయిపై అసెంబ్లీలో చర్చించలేదని, కనీసం సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో అసెంబ్లీ సజావుగా సాగుతోందని ఎక్కడా బూతులు తిట్టే వారు లేరని, కానీ వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బూతులు తిడుతూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారన్నారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేస్తామని, ఎవరైనా ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. తీవ్రవాద సమస్యను పరిష్కరించి, మత విధ్వేషాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో రౌడీ అనే వాడు ఉండటానికి వీల్లేదని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
అన్నీ సమస్యలను పరిష్కరిస్తున్నామని, కానీ వైసీపీ నిర్వాకం వలన ఏర్పడిన భూ వివాదాలను మాత్రం పరిష్కరించలేకపోతున్నామన్నారు. వైసీపీ హయాంలో రికార్డులను తారుమారు చేశారని, ప్రభుత్వ భూములను, అటవీ భూములను కూడా వదిలిపెట్టకుండా కబ్జా చేశారన్నారు. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ల్యాండ్ గ్య్రాబింగ్ బిల్లు నిషేధం కింద కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో చట్టాలు కూడా పగడ్బంధీగా ఉండాలని పేర్కొన్నారు.